17, జనవరి 2012, మంగళవారం

అభిమానం ముదిరితే అనుమానమే

అభిమానం ముదిరితే అనుమానమే
 
మగవాళ్ళు దొంగచూపులు చూస్తుంటారని విన్నాను గానీ, మా ఆయన మరీ బరితెగించి ప్రతీ ఆడదాన్ని గుడ్లప్పగించి చూస్తున్నాడు. ఛీ ఛీ పక్కన పెళ్ళాం ఉండగా ఇలాటి ఛండాలప్పనులు చేసేవారిని చూడలేదు. మీరేమైనా నయం చెయ్యగలరా? అనడిగింది మధ్యవయస్కురాలు. పక్కనే భర్త..55 ఏళ్ళుండవచ్చు...కూర్చుని ఉన్నాడు
అంటే ఆయన అమ్మాయిల్ని చూడడం వరకేనా? లేక అడ్వాన్సు అవుతున్నారా?  
ఏమో విషయం దేవుడికే తెలియాలి. తలుచుకుంటేనే ఒళ్ళు మండుతోంది. కొంచెమైనా సంస్కారం లేకుండా ప్రతీ ఆడదాన్నీ.. ఇంకా ఉద్యోగం చేసే బాంకులో ఏం వెలగబెడుతున్నారో తెలీదు. కోపంతో అంది
ఎదుటివారు మంచివారైనప్పుడు ఈయన చూస్తే మటుకు ఏమవుతుంది? మనం ఎందుకు భయపడాలి?  
కాని, మన బంగారం మంచిది కాదుగదా? అంది.
అంతవరకూ మాట్లాడకుండా మౌనంగా ఉన్న భర్త మధ్యలో కలగజేసుకుని సార్! నా జీవితం నరకమైపోతోంది. నుంచుంటే అనుమానం, బాల్కనీలోకెళ్తే అనుమానం, ఎటువెళ్ళినా అనుమానమే.. నాకేం చేయాలో తెలియడం లేదు. మీ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పిస్తానని లాక్కొచ్చింది. మా ఇద్దరితో మాట్లాడి, ఎవరికి ట్రీట్ మెంట్ ఇవ్వాలో మీరే నిర్ణయించుకోండి.. అన్నాడు
ఇంతవరకూ పనిచేసిన ప్రతీ బ్రాంచిలో అమ్మాయిలతో మీకు సంబంధం ఉంది. మనం ఉన్న ప్రతి ఇంటి పక్కవాళ్ళతో మీకు సంబంధం ఉంది..అని ఇంకా చెప్పబోతుండగా,
ఆగండాగండి..మీ ఆయన అంత అందగాడనుకుంటున్నారా? ఆడవాళ్ళంటే అంత చులకన పనికిరాదు. అని కావాలని గట్టిగా అడిగాను
కరెక్టు సార్, బాగా అడిగారు. మేము ఒరిస్సాలో ఉన్నప్పుడు ఇటువంటి అనుమానంతో అయిదుళ్ళు మార్పించింది. తమిళనాడులో ఎనిమిది ఇళ్ళు ఆరునెలల కాలంలో మార్పించింది. ఇంటావిడతో సంబంధం ఉందనీ, పాలమనిషితో, పనిమనిషితో, చివరికి పాకీ మనిషితో కూడా సంబంధం అంటగట్టేసింది. పిల్లల ముందు చులకన చేసింది. నాకు పదహారేళ్ళమ్మాయి, పద్నాలుగేళ్ళ అబ్బాయి. వాళ్ళు నాగురించి ఏమనుకుంటారని కూడా ఆలోచించలేదు. ఈవిడ భయానికి నేను మా అమ్మాయిని దగ్గరకు కూడా తీసుకోలేని దౌర్భాగ్యస్థితి వచ్చించి అన్నాడు
నేనంత నీఛురాల్ని కాదు. ఇంతకీ అవన్నీ అనవసరం. మీరు మారతారా, లేదా? అని కోపంగా అడిగింది
లాభం లేదని, చూడమ్మా! మీరు మీ ఆయన్ని ఇంతగా అనుమానిస్తున్నారు కదా ఆయన స్త్రీతోనైనా రహస్యంగా మాట్లాడటం గానీ, కలవడం గానీ మీరు చూశారా! అడిగాను
అబ్బో!.. ఆయన అంత తెలివితక్కువ వాడనుకుంటున్నారా? అన్ని పకడ్బందీగా చేసుకుంటాడు. అంది గుర్రుగా అతని వైపు చూస్తూ.. 
చూడమ్మా.. నీ వన్నట్లుగా  అంతమందితో తిరుగుతుంటే నీకీపాటికి కచ్చితంగా దొరికిపోయుండేవాడు. అంటూ కౌన్సిలింగ్ ప్రారంభించాను
అంతేలెండి..మీరూ మగవాళ్ళే కదా! ఉదాహరణకు ఢిల్లీలో మా ఆయన పొద్దున్నే స్కూటర్ తీసుకుని బయటకు వెళ్ళే సమయానికి ఎదురింట్లో పంజాబీ అమ్మాయి వాకిట్లో నిలబడి ఉండేది. అలా చాలా సార్లు జరిగింది. దాంతో సంబంధముందని అనుమానం. పిల్లను పిలిచి జాగ్రత్తగా ఉండమని ఒకసారి మందలించాను కూడా
తరువాతేం జరిగిందో తెలుసా? అమ్మాయి తండ్రి సర్దార్జీ మా ఆవిడను, నన్నూ బెదిరిస్తే రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసేశాం. మీరు చెబితే నవ్వుతారు గానీ, చివరకు టీవీలో వచ్చే అమ్మాయిలకేసి చూసినా టీవీ కట్టేస్తుంది. ప్రస్తుతం టీవీలో మగవాళ్ళు చదివే వార్తలు మాత్రమే చూడాలన్నమాట. నాకేం చెయ్యాలో పాలుపోవడం లేదు.
నా కర్మ కాలి మీలాటి తిరుగుబోతుని చేసుకున్నాను.
పోనీ విడాకులు తీసుకుందామా
చూశారా.. ఆయన కోరిక ఎలా బయటపెట్టారో!? 
ఇక ఇద్దరూ ఆపండి. చూడమ్మా! నీకు మీవారంటే వల్లమాలిన ప్రేమ, అభిమానం. నా మొగుడు నాకే సొంతం అనే భావన బలంగా ఉంది. అలాగే అతనిక్కూడా మీరంటె అమితప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉన్నాయి. అవి లేకపోతే నిజంగా ఈపాటికి పారిపోయుండేవాడు. మీ ఇద్దరిలో ఒకరంటే ఒకరికి అభిమానం ఉంది కానీ, మీకు అభిమానం అధికమై అనుమానంగా మారింది. దానివల్లనే ఇన్ని సమస్యలొచ్చిపడ్డాయి. ఒకవేళ అతనికే గాని ఇతరులతో సంబంధముంటే ఈపాటికి ఎక్కడో ఒకచోట సెటిలైపోయుండేవాడు. కాబట్టి ఈరోజు నుంచి ఆయనపై అనుమానం స్థానంలో అభిమానం పెంచుకో. లేకపోతే మీరన్నంతపనీ ఆయన చేయగలడు. సైకాలజీలో డిస్ గైజ్ డ్ సజెషన్ (disguised suggestion) ... అంటే మనకి తెలియకుండానే ఎదుటివారికి సలహా ఇవ్వడం అన్నమాట. పదేపదే ఒకే హెచ్చరిక ఇవ్వడం వల్ల ఇరవయ్యొక్క పర్యాయాల తర్వాత ఎదుటివారికి పని చేయాలనిపిస్తుంది నేను చెయ్యకపోయినా, వారు అంటున్నప్పుడు చెస్తే ఏమని వారికి అనిపిస్తుంది
మరి నేను వెయ్యిసార్లకు పైగానే అన్నాను
ఆయన ఒక్కసారి కూడా మీ హెచ్చరికను తీవ్రంగా మనసుకి తీసుకోలేదు. మీమీద ప్రేమతోనే సుమా! ఉదాహరణకి మీరు మీ అబ్బాయితో ఎదురింటి అబ్బాయి చెడ్డవాడు; వాడితో మాట్లాడద్దు అని చెప్పారనుకోండి మర్నాడే వాడితో రహస్యంగా, మా అమ్మ నీతో మాట్లాడవద్దని చెప్పింది కాబట్టి మనం స్కూల్లోనే మాట్లాడుకుందాం అంటాడు.. తెలుసా?  
నిజమే..అలాగే చేశాడు మావాడు. అంతా ఆయన పోలికే
అదే వద్దు. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. పిల్లలు పెద్దవాళ్ళయిపోయాక ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయాక మీరు ఒకరికొకరు తోడుగా ఉండాలి. అని చెప్పి నాలుగు సెషన్స్ తీసుకున్నాక ఇప్పుడు వారిద్దరూ చిలకాగోరింకల్లా ఉన్నారు.
Dr. బి.వి. పట్టాభిరాం:

బీ వీ పట్టాభి రాం, పరిచయం అక్కర్లేని పేరు...ఎన్నో ఏళ్ళుగా మేజిక్ రంగం లోనూ, ఇటు సైకాలజీ రంగంలోనూ తనదైన ముద్రతో ఎంతో మందికి స్ఫూర్తి కలిగించే అద్భుతమైన రచనలు అందిస్తూ, అనేక మంది యువతకి లక్ష్య సాధన వైపుకు నడిపించే ట్రైనింగ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్న డాక్టర్ బి.వి. పట్టాభిరాం రచనల సమాహారం ఈ "పట్టాభిరామాయణం".




పట్టాభిరామాయణం-పరిశోధనల పారాయణం వ్యక్తిత్వ వికాసం-పాఠకులకు ప్రకాశం Happyness is our Choice

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు

Copy Right

Page copy protected against web site content infringement by Copyscape