6, అక్టోబర్ 2009, మంగళవారం

అపజయాలన్నీ అవకాశాలే

అపజయాలన్నీ అవకాశాలే

ఈ జన్మలో మావాడు టెన్స్ క్లాసు పాసవుతాడనే నమ్మకం నాకు ఆవగింజంత కూడా లేదు. అంటూ ఉస్సూరుమని కూర్చుంది ఓ తల్లి.
మధ్యపాపిడితో పెద్ద బొట్టుతో లూజ్ షర్ట్ వేసుకుని, బెదురు చూపులతో ఆమె పక్కన కూర్చున్నాడు కొడుకు.
ఇప్పటికి ఎన్నిసార్లు టెన్త్ పరీక్ష రాశాడు? అని అడిగాడు.
రెండుసార్లు రాశాడు. వీడి బుర్రలో ఏదైనా విషయం ఉంటేనే కదా రాయటానికి. బుర్రనిండా మట్టి... మట్టి తప్ప ఏమీ లేదు. చచ్చీచడీ ఫీజులు కడుతున్నాం. వీడెళ్ళి అక్కడ సున్నాలు చుట్టి వస్తున్నాడు. అంది కోపంగా!
కొడుకు మౌనంగా తల దించుకుని వింటున్నాడు.
మరి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు? అతను పాసవడనే విశ్వాసం మీకు బాగా ఉంది కదా! పైగా బుర్రనిండా మట్టి ఉంటుందంటున్నారు? అన్నాను గంభీరంగా.
ఆహా..అది కాదు..మీరు చెప్తే పాసవుతాడేమోనని. అయినా నా బాథ మీకెలా తెలుస్తుంది. మా ఆడబడుచు కొడుకు ఫస్ట్ టైమే, ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు. మరి వీడికేం రోగం? అప్పటికి అడిగినవన్నీ అమరుస్తున్నాం. తిన్నది అరక్క ఇలా అయ్యాడు! మీరిలాంటి వాళ్ళని బాగుచేస్తారని విన్నాను. వీడికి చదివేయోగం ఉందా లేదా చెప్పండి! అంది మండిపడుతూ.
ఆవిడ మాటలు విన్నాక, ఆమెది అథారిటేరియన్ పర్సనాలిటీ అని తెలిసిపోయింది. ఆ కోవకు చెందినవారు ఎదుటివారికి విలువ ఇవ్వరు. తాము చెప్పిందే కరెక్ట్ అని అనుకుంటారు. అదే తత్త్వంతో భర్తని, కొడుకుని వాజెమ్మలుగా జమకట్టింది. ఇక ఈవిడతో మాట్లాడి లాభం లేదని, అబ్బాయితో సంభాషణ ప్రారంభించాను.
మీ అమ్మ అన్నట్లుగా, నువ్వు కూడా ఈ జన్మలో పరీక్ష పాసవ్వలేవని అనుకుంటున్నావా? అని అడిగాను.
నాకూ అలాగే అనిపిస్తోంది. నా బుర్రలో ఏమీ లేదని నాక్కూడా అనిపిస్తోంది. పైగా రెండుసార్లు తప్పినవాడిని, మళ్ళీ వెళ్ళటం అనవసరం.వెళ్ళినా కూడా గ్యారంటీగా ఫెయిల్ అవుతాను. అన్నాడు అపారమైన విశ్వాసంతో. అలాగా! సరేలే వచ్చే వారంలో రెండు రోజులు నీతో మాట్లాడి, నీమీద నీకు విశ్వాసం కలిగిస్తాను. అంతవరకు నువ్వు మళ్ళీ పరీక్ష గురించి ఆలోచించకు! అని చెప్పి అతని తల్లితో అమ్మా! మీరు మీవాడికి నెగెటివ్ సజెషన్స్ ఇవ్వకండి.!
పరీక్ష గురించి, ఫెయిలవడం గురించి, మీ ఆడబడుచు కొడుకు పాసవడం గురిమ్చి... ఇలా అతనికి సంబంధించిన ఏ విషయాలనూ ప్రస్తావించకండి. అతనిలోనిలోపాలను ఎత్తి చూపే
బదులు, మంచి గుణాలను నేర్పండి! అని చెప్పి పంపాను.

ఇది జరిగిన రెండు రోజులకు, అనుకోకుండా చుట్టాలతో కలసి ఒక సర్కస్ చూడటానికి వెళ్ళాల్సివచ్చింది. పిల్లలంతా కేరింతలతో నానా హంగామా చేస్తున్నారు. టిక్కెట్లు ఇవ్వడం ఇంకా ప్రారంభించలేదు. సరే, ఏదో కాలక్షేపం చేద్దమని సర్కస్ గుడారం పక్కన కట్టి ఉంచిన ఏనుగులను చూడటానికి వెళ్ళాను.

అంకుల్, అంటూ చెయ్యి తీసుకుని షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే ఎవరా అని చూశాలు. రెండుసార్లు టెన్త్ ఫెయిలయ్యిన అబ్బాయి. అతనూ సర్కస్ చూడటానికి వచ్చాడు. ఇద్దరం ఏనుగులవైపు వెళ్ళాము. పెద్ద పెద్ద ఏనుగులు నాలుగు, చిన్నవి రెండూ ఉన్నాయి. వాటిని చూస్తూనే ఆ అబ్బాయి, నా చెయ్యి గట్టిగా పట్టుకుని, అంకుల్ అక్కడ అంత పెద్ద ఏనుగుని చిన్న తాడుతో కట్టారు.
అది కాని కాలు విదిపితే మన గతి ఏమవుతుంది? అటువైపు వద్దు రండి! అని పక్కకు లాగాడు. అక్కడ చూస్తే చిన్న ఏనుగుని బలమైన చెయిన్లతో కట్టి ఉంచారు. దాంతో మరీ టెన్షన్ పడాడు.

అంకుల్ వీళ్ళూ ఎంత పొరపాటు చేశారో మీరు గమనించారా? పాపం బుజ్జి ఏనుగుని బలమైన సంకెళ్ళతో బంధించారు. కొండంత ఏనుగుని గడ్డిపోచలతో పేనిన తాడుతో కట్టిపడేశారు. ఆ చిన్నది బాధపడటం మాట అటుంచి, పెద్ద ఏనుగు కాని కాలు గుంజితే, ఈ గుడారమ్ నేలమట్టమవదూ? ఇంత పెద్ద సర్కస్ కంపెనీకి ఇంత చిన్న విషయం తెలీదా? మనం పోదాం రండి.. అన్నాడు కంగారుగా.
ఆ అబ్బాయికి కౌన్సిలింగ్ చేయడానికి మంచి అవకాశం లభించింది నాకు. ఇద్దరం బయటకు వచ్చాక అతనికి చెప్పాను. సర్కస్ వాళ్ళు చేసింది కరెక్టే. చిన్న ఏనుగుని
సంకెళ్ళతోనే కట్టాలి. దాన్ని పుట్టినప్పటి నుండీ సంకెళ్ళతోనే బంధిస్తారు. ఆ గున్న ఏనుగు తప్పించుకోవడానికి సకలవిధాల ప్రయత్నిస్తుందట.
ఎంత ప్రయత్నం చేసినా లాభం లేదని తెలిశాక చివరకు, అంటే రెండేళ్ళకు ఆ ప్రయత్నం విరమిస్తుంది. అది గుర్తించిన మావటివాడు, ఆనాటినుండీ దాన్ని గడ్డిపోచలతో కట్టినా అది ఆవగింజంత ప్రయత్నం కూడా చేయదు. చచ్చే వరకూ దానికి తప్పీంచుకొవాలనే ఆలోచనే రాదు. ఎందుకంటే ఎంత ప్రయత్నం చేసినా
లాభం లేదు,పైగా రెండేళ్ళు ప్రయత్నం చేశాను కదా అనుకుంటుందట! అన్నాడు.
ఓహో అలాగా! అన్నాడు ఆశ్చర్యపోతూ..
నీపని కూడా ప్రస్తుతం అలాగే ఉంది. అది జంతువు కాబట్టి రెండేళ్ళూ ప్రయత్నించి ఊరుకుంది. మనం మానవులం. భగవంతుడు మనకు బుద్ధి ఇచ్చాడు. మనకు ఆలోచించే శక్తి ఉంది. కాబట్టి మళ్ళి ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు. అపజయాలను అవకాశాలుగా మార్చుకోవాలి. నువ్వు ఈసారి పరీక్ష రాయి. విజయం నీదే అన్నాను.
ఆ అబ్బాయి మళ్ళీ నాకు నాలుగేళ్ళు కనబడలేదు. మొన్న మద్రాసు ఐ.ఐ.టి. లో సాంస్కృతిక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నాడు. ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడట. వచ్చి కలిసి కృతజ్ఞ్తతలు తెలిపాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు

Copy Right

Page copy protected against web site content infringement by Copyscape