5, మార్చి 2010, శుక్రవారం


 చివరకు దేవుడు కూడా నామీద ఇంత దారుణంగా పగ పడతాడని ఊహించలేదు. ప్రజలను నమ్మడం మానేశాను. కాని, భగవంతుడు కూడా ఇలా చేస్తే ఎలా? అంటూ కూర్చున్నాడు పాతికేళ్ళ యువకుడు.

ఏం జరిగింది? మీకొచ్చిన సమస్య ఏమిటి? అనడిగాను.
నా సమస్య చెప్పినా, మీవద్ద పరిష్కారం లేదని నాకు తెలుసు. ఈ జీవితమంతా ఇలా కుమిలిపోవల్సిందే..!

ఇంతకూ విషయమేమిటో చెప్పండి?
నేను బి.ఇ. చదివాను. కాలేజీలో క్రికెట్ ఛాంపియన్ను. చిన్నప్పటినుండి అన్నింటా టాప్ గా ఉండేవాడిని. ఇంజనీరింగ్ తరువాత క్రికెట్ వృత్తిగా తీసుకోవాలని అనుకున్నాను. కాని, మనచుట్టూ ఉన్న సమాజం ఎంత కుళ్ళిపోయిందో తరువాత తెలిసింది. నేను సెలక్షన్ కాకుండా నా మిత్రులే అడ్డుపడ్డారు. చేతకాని దద్దమ్మల్ని సెలెక్టు చేసుకున్నారు. వాళ్ళు ఆటకన్నా ఆడే ఆటమీద వచ్చే డబ్బుకై ఆసక్తిగా ఉన్నారు. అంటూ ఆగాడు. మళ్ళీ ప్రారంభిస్తూ, ఈ పరిస్థితి ఇలా ఉండగా మొన్న మోటార్ సైకిల్ మీద వస్తుంటే పెద్ద యాక్సిడెంట్ అయింది. కాలువిరిగి ఆరునెలలు ఆసుపత్రిలో ఉన్నాను. ఇప్పుడు నా కాలులో రెండు స్టీల్ రాడ్స్ ఉన్నాయి. స్పీడుగా నడవవద్దని, పరిగెత్తడంలాంటివి కలలో కూడా చేయకూడదని డాక్టర్ చెప్పాడు. శాశ్వతంగా క్రికెట్ ఆటనుండి దేవుడు తొలగించాడు. అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు.

డోంట్ వర్రీ! ఇప్పుడు మనం చెయ్యగలిగేదేమీ లేదని బాధపడుతూ కూర్చోకూడదు. చెయ్యవలసిందల్లా ఇప్పుడే ప్రారంభమైంది.
అదెలా?
దానిని సైకాలజీలో కాంపెన్సేషన్ అంటారు. ఇదొకరకమైన డిఫెన్సు మెకానిజం, అంటే మీరు ఇప్పుడు క్రికెట్ ఆడలేకపోయినా, క్రికెట్ ఆటలోగల అనుభవంతో క్రికెట్ కామెంటేటర్ కావచ్చు. పత్రికల్లో క్రికెట్ కాలమ్స్ రాసుకోవచ్చు. కాలు పనిచేయకపోయినా చెయ్యి, నోరు పనిచేస్తున్నాయి కాబట్టి ఎన్నో అద్భుతాలు చెయ్యవచ్చు. ఎందుకంటే మీరు సాధించిన విజయాలు కూడా ఉన్నాయని మరిచిపోవద్దు. ఇంజనీరింగ్ లో సీటు రావడం, పాసవ్వడం అదృష్టమే కదా.

అవుననుకోండి..కాని, నా కెందుకిలా జరిగిందనే క్షోభ నన్ను వేరే ఏ ప్రయత్నమూ చెయ్యనియ్యడం లేదు. నేనేం పాపం చేశాను. దేవుడు ఎందుకింత దుర్మార్గంగా శిక్షించాడు అనే బాధనుండి బయటపడపోలేకపోతున్నాను.
జరిగిందానికి వగచి లాభం లేదు. ఈ సందర్భంగా ఒక వ్యక్తి గురించి చెబుతాను. అమెరికాలోని మిచెల్ కి మీలాగే మోటార్ సైకిల్ ఆక్సిడెంట్ జరిగి శరీరం దాదాపు 65 శాతం కాలిపోయింది. మొహం గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది. చేతివేళ్ళు పనిచేయడం లేదు. చెంచాలు, ఫోర్కులు కూడా పట్టుకోలేడు.చివరకు ఫోను డయలు చేయలేడు. అయినా, అతను అపారవిశ్వాసంతో అన్నీ తట్టుకుని జీవితం గడపనిశ్చయింది. ఏడాది తర్వాత వ్యాపారం ప్రారంభించి రాణించాడు. ఎవరైనా అతడిని పరిహసిస్తే, నేనేదో అధిగమించానని అనుకోవడం లేదు. మీరు నాలో అంగవైకల్యం చూస్తుంటే, నేను మీలోని మానసిక వైకల్యాన్ని కూడా చూడలేకపోతున్నాను అని చురకపెడ్తాడు. కాబట్టి మీరు మీ శరీరమనే నౌకను నడిసముద్రంలో ముంచకుండా ఒడ్డుకు తీసుకెళ్ళాలి.

కాని, నా మనసు సహకరించడం లేదు. మీరు చెప్పినట్ట్లు ఏదైనా మొదలుపెట్టినా మళ్ళీ ఇటువంటి ప్రమాదం జరిగితే.." అటువంటి పిచ్చిపిచ్చి ఆలోచనలు కట్టిపెట్టండి. ఒకవేళ మళ్ళీ జరిగినా, దాన్నీ అధిగమించవచ్చు. మిచెల్ కూ అదే జరిగింది. వ్యాపార నిమిత్తం విమానంలో వెళ్తుండగా, అది కూలి అతని వెన్నుముక దెబ్బతింది. పన్నెండు ఆపరేషన్లు జరిగాయి. నడుం కింద నుండి కాళ్ళవరకు శరీరం చచ్చుపడిపోయింది. జీవితాంతం వీల్ ఛైయిర్ లో గడపాలని డాక్టర్లు చెప్పారు. అయినా, కొండంత ధైర్యంతో, ఇది నేనూ దేవుడూ ఆడుకుంటున్న ఆట. ఇందులో నేను ఓడిపోలేదు. నాలో ఇంకా క్రీడాస్ఫూర్తి ఉంది. దేవుడు ఓడిపోడు కాని, నేను నెగ్గడం నటుకు ఖాయం అన్నాడు. మీరు కూడా అలాటి ఆత్మవిశ్వాసం నేర్చుకోవాలి.

మీరు చెప్పింది నిజమే. మొన్న రవీంద్రభారతి లో నటుడు నూతన్ ప్రసాద్ ని చూసినప్పుడు నాకు అదే అనిపించింది. ఆయన ముఖంలో నవ్వు చెరగలేదు. నేనూ అలా ఉండగలనా?
నిక్షేపంగా, మీలాటివాళ్ళతో ప్రేరణ కలిగించడానికి అలాటివారిని యాక్టివ్ గా ఉంచుతాడు భగవంతుడు. మిచెల్ విషయంలోనూ అదే జరిగింది. రెండవ ప్రమాదం తర్వాత, అతను వీల్ ఛెయిర్ లో తిరుగుతూ, కాలరడోలోని క్రెస్టెడ్ బట్ మేయర్ గా, అందంగా లేకపోయినా, కూర్చుని అందమైన పనులు చేయగలను. అనే నినాదంతో అఖండ విజయం సాధించాడు. ఆయనతో పోలిస్తే మీ ప్రమాదం చిన్నదేగదా?

నిజమేకాని, ఇలా ఎవరైనా కౌన్సిలింగ్ చేసుంటే, నేనూ ఈపాటికి ఏదో చేసేవాడినికదా?
ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మీ జీవితం అనే ఆటను ఇప్పుడే ప్రారంభించండి. మనసుకు, శరీరానికి చక్కని కమ్యూనికేషన్ అలవాటు చేయండి. అంగవైకల్యాన్ని గురించి కుమిలిపోవడం కన్నా, మీరేం చెయ్యగలరో ఆలోచించండి. ఇటీవలనే ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్న మన తెలుగువాడు శ్రీ జైపాల్ రెడ్డి తన అంగవైకల్యాన్ని ఎంత అందంగా జయించారో మీకు తెలుసు.

అలనాడు తన వయోలిన్ తో శ్రోతలను మైమరిపించిన ద్వారం వెంకటస్వామి నాయుడు అంథస్వాన్ని చిన్ననాడే జయించారు. అలా అద్భుతాలు సాధిస్తున్నవారు వివ్ధ రంగాల్లో ఎంతో మంది ఉన్నారు. మీకు తెలిసిన వారే ఇలా ఎంతోమంది ఉన్నా మీరెందుకింత వర్రీ అవుతారు?

నిజమే..ఏదో బాధలో మరిచిపోయాను. నాకు తెలిసిన రాజేశ్వరరావుగారనే పబ్లిషర్ రైలుకింద పడి కాలు పోగొట్టుకున్నా, ఆరునెలల్లోనే కృత్రిమ కాలుతో మరలాపనిలో చేరాడు. నేనూ ఇది ఒక వరంగా భావించి అద్భుతాలు చేసి చూపిస్తాను. నిజానికి నా సమస్య చిన్నదే. అనవసరంగా బాధపడుతున్నాను. ఇంకా డిప్రెషన్ కు లోనుకాకుండా చేశారు. ధాంక్స్.
వెరీ గుడ్..జీవితాన్ని ఛాలెంజ్ గా తీసుకోండి..గుడ్ లక్..


పట్టాభిరామాయణం-పరిశోధనల పారాయణం
వ్యక్తిత్వ వికాసం-పాఠకులకు ప్రకాశం
Happyness is our Choice

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు

Copy Right

Page copy protected against web site content infringement by Copyscape